Skip to main content

గురుకుల పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్






   తెలంగాణలోని బాలికల గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. ఒకరిద్దరి కోసం మొత్తం నియామక ప్రక్రియను నిలిపివేయ లేమని స్పష్టం చేసింది. గతేడాది జూన్ 4న జారీ అయిన జీవో 1,274 మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ బాలికల గురుకులాల్లో ఖాళీ ఉన్న పోస్టులను పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఎ.సత్యనారాయణ, మరో వ్యక్తి ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి జూలై 19న టీఎస్‌పీఎస్సీ చేపట్టిన నియామక ప్రక్రియ అమలు కాకుండా స్టే విధించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులను రద్దు చేసింది. గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీపై గ‌తంలో జారీ చేసిన మధ్యంతర ఆదేశాలే ఈ కేసులోనూ వర్తిస్తాయని ధర్మాసనం వెల్లడించింది. అప్పీల్ పిటిషన్‌పై వాదించేందుకు వ్యవధి కావాలని, అంతవరకు సింగిల్ జడ్జి స్టే ఆదేశాల్ని కొనసాగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యం రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. బాలికల, మహిళల విద్యా సంస్థల్లో ని అన్ని పోస్టుల్ని మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేయాలని జీవో జారీ చేసిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా గురుకులాలు తమ బైలాస్‌ను మార్పు చేసుకోలేదన్నది పిటిషనర్ వాదన. కాగా విచారణ ఆగస్టు 9వ తేదీకి వాయిదా పడింది.

Comments

Popular posts from this blog