నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ.....
స్నేహాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా నిర్వచించగలం? ఒక గాడాంధకారం అలుముకున్నప్పుడు, నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు.. 'నీ కోసం నేనున్నాను సుమా..!' అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తుంది స్నేహం. స్నేహం అంటే భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు... బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే... పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఏ కాలేజీలోనో.. లైబ్రరీలోనో.. కలిసి నడిచే కారిడార్‌లోనో.. తరగతి గదిలోని ఒకే బెంచిపై.. మాస్టారు బోధించే పాఠాల్లో సందేహాల్లోనో.. ఊపిరి పోసుకొనేదే స్నేహం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి.. మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణం ఇది. ఇలాంటి సమాజంలోనూ ఎక్కడో ఒకచోట ఆత్మీయమైన స్నేహాలు.. ఉన్నతమైన మానవతా విలువలు.. వెలుగురేఖల్లా దారి చూపుతూనే ఉంటాయి. జీవితకాలం పాటు మనతో నడుస్తూ.. ప్రయాణిస్తూ.. వెన్నంటి ఉండేది స్నేహం. అలాంటి మీ స్నేహితులందరికీ 'హ్యాపీ ఫ్రెండ్‌ఫిప్ డే!' ... మీలాగే ఇక్కడ కొందరు సెలబ్రెటీల మధ్య స్నేహం ఎలా విరబూసిందో తెలుసుకుందాం పదండి.
ఈ పెద్దోళ్లదో సరదా స్నేహం
కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ తెలుగు సినిమా ఇండిస్టీలో మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు. ఎంతోమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన కమెడియన్లు. 'మామగారు' చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబోప్యాక్ ఎన్నో ఏళ్ల పాటూ, సినిమాల పాటూ నవ్విస్తూనే ఉంది. అయితే వీళ్లిద్దరి గురించి మాట్లాడినప్పుడు వీరి స్నేహం గురించి కూడా మాట్లాడాల్సిందే. అంతలా కలిసిపోయాయి వారి మనసులు. షూటింగ్ స్పాట్‌లో కోట, బాబూలు ఉన్నారంటే అదొక పిక్నిక్ స్పాట్‌లా ఉంటుంది. ఈ మాట అప్పటి సినీజనాలు తమ జ్ఞాపకాల్లో నెమరేసుకునే విషయం. ఈ ఇద్దరూ కావాలనే ఫిల్మ్‌నగర్‌లో పక్కపక్కనే ఇళ్లు కట్టించుకున్నారు. వేరువేరు షూటింగుల్లో బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారైనా కలిసి మాట్లాడుకునేవారు. ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల బాబూమోహన్ మాదాపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అయినా వీరిద్దరూ తరచుగా కలుస్తూనే ఉంటారు. ''అసలు మేమిద్దరమూ కలిసామంటే మామూలుగా ఉండదు.. సెట్‌లో అంతా నవ్వుల జల్లులే.. ఒక పండుగ వాతావరణం వచ్చేస్తుంది!'' అంటూ బాబూమోహన్ ఎప్పుడూ చెప్తుంటారు.
ఇప్పటికీ అద్దె కడుతున్నారట!
సునీల్, త్రివిక్రమ్ ... ఈ రెండు పేర్లూ తెలుగు వారందరికీ సుపరిచితాలే. ఒకరు పెన్‌కు పదును పెట్టి పంచ్ డైలాగుల ప్రవాహంతో దూసుకుపోయేవారు. మరొకరు పర్ఫెక్ట్ టైమింగ్‌తో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగిపోయిన వారు. అయితే ఇప్పటికీ వీరి స్నేహాన్ని చూసిన ఎవరికైనా సరే ముచ్చటేయాల్సిందే. ఈ ఇద్దరూ ఒకేసారి భీమవరం నుంచి ఇండిస్టీ ఎంట్రీ కోసం హైదరాబాద్ వచ్చారు. పంజాగుట్టలోని సాయిబాబా గుడి దగ్గర రూములో కలిసుండేవారు. అక్కడి నుంచే సినిమా ప్రయత్నాలు చేశారు. తిరిగి సాయంత్రం రూముకు చేరుకున్న తర్వాత త్రివిక్రమ్ అక్కడే ట్యూషన్లు కూడా చెప్పేవాడు. ఇద్దరూ ఎన్నో కష్టాలు పడ్డారు, మరెన్నో రోజులు పస్తులూ ఉన్నారు. చివరకి ఇద్దరూ తమతమ స్థానాల్లో నిలదొక్కుకున్నారు. అయితే ఆ రోజు నుంచీ, ఈ రోజు వరకూ వాళ్ల స్నేహం అలానే నిత్యనూతనంగా ఉంది. రోజురోజుకూ బలపడుతూనే ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... వీళ్లిద్దరూ ఇప్పటికీ ఆ పంజాగుట్టలోని రూముకు అద్దె కడుతూనే ఉన్నారట.! ''ఆ గదిని సెంటిమెంట్‌గా భావించి.. ఆ రూము ఓనర్‌కు రూము రెంట్ ఇస్తూ ఉంటాం!'' అని ఓ సందర్భంలో సునీల్ చెప్పారు.
అల్లరే అల్లరి
నాని, మనోజ్, అల్లరి నరేష్... ఈ ముగ్గురూ కలిస్తే ఇక అల్లరే అల్లరి. సాధారణంగా ఇండిస్టీలో ఒకొరికొకరికి మధ్య చాలా విభేదాలుంటాయని అంటూంటారు. కానీ ఈ కుర్రోళ్లు మాత్రం అలాంటివాటికి చెక్ పెడుతూ.. స్నేహంగా కలిసిపోతారు. ఏ కొత్త హీరో సినిమా రిలీజ్ అయినా వెన్నంటి ఉండి భుజం తడతారు. నాన్నల బ్యాక్‌గ్రౌండ్‌లను వీళ్ల స్నేహాల మధ్యకు అస్సలు తీసుకురారు. వీరిలో ఎవరి సినిమా రిలీజ్ అయినా.. ఆడియో ఫంక్షన్ వేడుక అయినా.. మిగతా ఇద్దరూ తమ సొంత సినిమా వేడుకలానే భావిస్తారు. ఏదేమైనా కొత్తతరం హీరోలకు వీళ్ల స్నేహాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ అందరిలోనూ స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చిస్తాం. స్నేహం ఉన్నచోట అనుమానం, కోపం, ద్వేషం దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. 'స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...!' అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.
ఐ లవ్ యూ ఫ్రెండ్!
స్నేహం అనేది ఒక మహావృక్షంలా ఎదుగుతుంది.. జీవితంతో మమేకమవుతుంది.. ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది. మదిలో నిక్షిప్తమైన భావాలను.. అనుభవాలను.. అనుభూతులను పంచుకోవడం తప్ప.. ఏ స్వార్ధం లేని జీవన బంధం స్నేహం. జీవితంలో ఎవరున్నా, లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలనుకుంటాం. అలాంటి వారిలో మనకు బాగా గుర్తున్నవారు సచిన్ కాంబ్లీ.
సచిన్... మొత్తం జీవితాన్ని క్రికెట్‌కు ఇచ్చేసిన అంకితభావం అతనది. సచిన్ అనగానే క్రికెట్ గుర్తొచ్చేంత ప్రయాణం చేశాడు. అలానే ఆ పేరు వినపడగానే అతని కుటుంబసభ్యులతో పాటు అతని అపూర్వ స్నేహితుడు వినోద్ కాంబ్లీ కూడా గుర్తొస్తాడు. అది 1988 సంవత్సరం సచిన్-కాంబ్లీలు ఇద్దరూ శారదాశ్రమం పాఠశాల తరపున క్రికెట్ ఆడుతున్న రోజులు. ఒక్కసారిగా యావత్ భారత క్రికెట్ చిన్నారి కాంబ్లీ, సచిన్‌ల వైపు చూసిన రోజు. ఈ ఇద్దరి జోడీ ఏకంగా 664 పరుగులు చేసి 'ప్రపంచ రికార్డ్' నెలకొల్పారు. ఇది వీరి జీవితాల్లో అపురూపమైన ఘట్టం. ఇదే వీరిద్దరూ ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా స్కూల్ రోజుల నుంచే వీళ్ల స్నేహం కొనసాగుతూనే ఉంది. సచిన్‌లానే టాలెంటడ్ ప్లేయర్ అయినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల కాంబ్లీ కెరీర్ నుంచి త్వరగా తప్పుకోవాల్సి వచ్చింది. అయినా వాళ్ల స్నేహం ఇప్పటికీ స్వచ్ఛంగా కొనసాగుతూనే ఉంది. మధ్యమధ్యలో కొన్ని పొరపొచ్చాలు వచ్చినా.. వారిద్దరి అపూర్వస్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. ఈ మధ్యనే సచిన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'సచిన్... ఏ బిలియన్ డ్రీమ్స్' చిత్రం విడుదలైన సందర్భంగా 'డియర్ మాస్టర్ బ్లాస్టర్... ఐ లవ్ యూ!' అంటూ సోషల్ మీడియాలో కాంబ్లీ తన ప్రేమను కురిపించాడు.
Link:-http://amzn.to/2vehz6t

Comments
Post a Comment