Skip to main content

భీమ్‌ యూజర్లకు భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు



           


       

          ఈ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భీమ్‌ యూజర్లకు బంపర్‌ బొనాంజాలు అందనున్నాయి. భీమ్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ యాప్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా గత డిసెంబర్‌లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలో యూపీఐ ద్వారా పనిచేస్తోంది. భీమ్‌ యాప్‌ వాడే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్‌లు అందించాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో ఏపీ హోటా చెప్పారు. ఇదే క్రమంలో భీమ్‌ కొత్త వెర్షన్‌ను కూడా ఆవిష్కరించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
క్యాష్‌బ్యాక్‌ ప్రోత్సహకాలను మరింత పెంచాలని తాము ప్రభుత్వం చర్చించామని, అలాగైతేనే ఎక్కువమంది ఈ యాప్‌ వాడతారని చెప్పినట్టు తెలిపారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ ప్రోత్సహకాల ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భీమ్‌ యాప్‌ వాడేవారికి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు 10 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో భీమ్‌ యూజర్లకు ప్రోత్సహకాలను అందిస్తే, ఇతర పేమెంట్‌ యాప్‌లను వాడే వారు కూడా భీమ్‌ యాప్‌కు మరలుతారని వివరించారు. డిజిటల్‌ లావాదేవీల్లో ముందున్న పేటీఎం, ఫోన్‌పే యాప్‌లు తమ ప్లాట్‌ఫామ్‌లపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటికి గ్లోబల్‌ ఇన్వెస్టర్లు మద్దతు ఉండటం వల్ల డిస్కౌంట్లు సాధ్యపడుతున్నాయి. కానీ భీమ్‌ యాప్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తికి భీమ్‌ యాప్‌ను రిఫర్‌ చేస్తే, బోనస్‌ కింద 10 రూపాయలు, రిఫర్‌ చేసిన వ్యక్తి రూ.25 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. గత నెలలోనే యూపీఐ ద్వారా లావాలేవీలను పెంచడానికి వర్తకులకు యూపీఐ ఛార్జీలను బ్యాంకులు తగ్గించాయి.

Comments

Popular posts from this blog